India Private Gold Mine: భారత దేశంలో బంగారు గనులు ఉన్నాయని, అవి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని మాత్రమే ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇప్పటి నుంచి చరిత్ర మారబోతుంది. దేశంలో మొట్ట మొదటిసారి బంగారు గనులను ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకోబోతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అది మరెక్కడో కాదు.. మన పక్క రాష్ట్రంలోనే. ఈ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ గనిని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వహించనుంది.
READ ALSO: Bigg Boss 9 : ఏంటీ పిచ్చి పని.. సుమన్ శెట్టిని లాగి పడేసిన డిమాన్ పవన్..
చమురు తర్వాత బంగారమే..
భారతదేశంలోని మొట్టమొదటి పెద్ద ప్రైవేట్ బంగారు గని త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుందని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఉన్నతాధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం ప్రస్తుతం ఏటా 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని మీకు తెలుసా. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇండియా చమురు తర్వాత దిగుమతి చేసుకునేది బంగారాన్ని. అయితే ఈ గని ప్రారంభమైన తర్వాత భారత్ బంగారం దిగుమతులపై ఆధారపడటం కచ్చితంగా తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
BSEలో జాబితాలో నమోదు అయిన దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) దేశంలో మొట్టమొదటి, ఏకైక బంగారు అన్వేషణ సంస్థ. ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరిలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి బంగారు గనిని అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో ఈ కంపెనీకి వాటా ఉంది. జొన్నగిరి బంగారు ప్రాజెక్టుకు జూన్, జూలైలలో పర్యావరణ అనుమతి లభించిందని, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అనుమతులు కోరింది.
గనికి దారేది..
ఈ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరై గ్రామాల సమీపంలో ఉంది. 2003లో బంగారం కోసం అన్వేషించడానికి DGML స్థాపించారు. DGML గతంలో భారతదేశం సహా విదేశాలలో బంగారం అన్వేషణ కార్యకలాపాలలో పాల్గొంది. కంపెనీ మైనింగ్ ఆస్తులు భారతదేశం సహా పలు దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఈసందర్భంగా దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమాన్ ప్రసాద్ మాట్లాడుతూ.. భారతదేశంలో బంగారు ఉత్పత్తి 1.5 టన్నులు ఉందని తెలిపారు. వాళ్ల గని పని ప్రారంభించిన తర్వాత ఉత్పత్తి దాదాపు ఒక టన్ను పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది ఎంత ఉత్పత్తి అవుతుందంటే..
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్థిరీకరణ దశలో ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్లాంట్ సాంకేతికతపై మాత్రమే పని జరుగుతోందని, పూర్తి స్థాయి ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి సుమారు 750 కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని అంచనా. అయితే రెండు నుంచి మూడు ఏళ్లలో ఉత్పత్తిని 1,000 కిలోగ్రాములకు పెంచుతామని, ఇది ఇండియా బంగారం దిగుమతులను తగ్గిస్తుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.
READ ALSO: Coffee: కాఫీ ప్రియులకు అలర్ట్.. మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా?