ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని ఇండియా కూటమి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును విపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే వీరు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవాలని డిసైడ్ అయ్యారు.
లోక్‌సభ ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌తో భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. 10 రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరగా.. ఆరు రోజులు మాత్రం న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. గత రాత్రంతా ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వారిని ఎక్కడికక్కడే పోలీసులు నిలువరించారు. మరోవైపు ఆప్ మంత్రులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇక కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇలా టార్గెట్ చేయడం తప్పు అని.. రాజ్యాంగ విరుద్ధం. ఈ విధంగా రాజకీయాల స్థాయిని తగ్గించడం ప్రధానమంత్రికి సరికాదు అని ప్రియాంక గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. అలాగే శరద్ పవార్ కూడా తప్పుపట్టారు. ఇక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై ఇండియా కూటమి నేతలంతా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన్ను గురువారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానంలో కూడా కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు.