Site icon NTV Telugu

INDIA Bloc: ఇతర పక్షాలకు ఖర్గే పిలుపు.. ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానం

Mps

Mps

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇండియా కూటమి కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించింది. దీంతో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూటమి నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఇతర పక్షాలకు ఆహ్వానం పలికారు. మోడీ నైతికంగా పరాజయం పాలయ్యారని పేర్కొన్నారు. ఇతర పక్షాలు.. ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానం పలికారు.

ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉందని ఖర్గే తెలిపారు. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఇండియా కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే ప్రకటన చేశారు.

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు.. శరద్‌ పవార్‌ (ఎన్సీపీ-ఎస్‌పీ), ఎంకే స్టాలిన్‌ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), సంజయ్‌ రౌట్‌ (శివసేన-ఉద్ధవ్‌ఠాక్రేవర్గం), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), చంపయ్ సోరెన్‌ (జేఎంఎం), రాఘవ్‌ చద్దా (ఆప్‌), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే, కల్పనా సోరెన్‌ సహా పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

మరోవైపు ఎన్డీయే నేతలు ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీయే పక్షాలు మోడీని కూటమిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

 

Exit mobile version