ఫిబ్రవరి 9న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదట భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆసీస్ మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్..ఈ సిరీస్ ఆస్ట్రేలియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో టీమిండియాకు కంగారూ జట్టు రూపంలో కఠిన సవాల్ ఎదురు కానుందని పేర్కొన్నాడు. కీలక ప్లేయర్లు గాయాల కారణంగా దూరం కావడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న చాపెల్.. దీంతో సొంతగడ్డపై టీమిండియా మరింత బలహీనం కానుందని చెప్పుకొచ్చాడు.
Also Read: Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..
“రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడిన కారణంగా సొంతగడ్డపై కూడా టీమిండియా బలహీనంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లు విరాట్ కోహ్లీపైనే పూర్తిగా ఆధారపడతారు. భారం మొత్తం అతడిదే. ఈసారి ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుంది. భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈసారి అష్టన్ అగర్‌కు ఎక్కువ అవకాశాలు లభిస్తాయనుకుంటున్నా. నాథన్ లియోన్‌తో కలిసి ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాణించగలడు” అని చాపెల్ అన్నాడు. కాగా భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో చాపెల్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
Also Read: Womens T20 World Cup: విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధం..పూర్తి వివరాలివే
2020లో ఆసీస్ గడ్డపై టీమిండియా బోర్డర్- గవస్కర్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 9 నుంచి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి. అయితే, ఆసీస్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. సొంత దేశంలో రోహిత్ సేననే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. స్పిన్ పిచ్‌లపై ఆడేందుకు ఇబ్బందిపడే ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని గత ఫలితాలను బట్టి చెప్పవచ్చు.