India Alliance Meeting Today in Delhi on Government Formation: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ.. 199 సీట్లు సాధించింది. ‘400 సీట్లకు పైనే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ‘ఎన్డీయే’ మెజారిటీకే పరిమితం అయింది. అయితే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో.. ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం ఇండియా కూటమి సమావేశం జరగనుంది.
ఇండియా కూటమి సమావేశంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, చంపయి సొరేన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి రాజా తదితర నేతలు హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీకి సొంతంగా రాని నేపథ్యంలో.. ఇండియా కూటమి సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీయే కూటమిలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలకు ఇండియా కూటమి గాలం వేయడాన్ని ప్రారంభించాయని తెలుస్తోంది.
Also Read: IND vs IRE: ప్రపంచకప్ వేటకు వేళాయె.. నేడు ఐర్లాండ్‌తో భారత్ ఢీ!
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై నేడు జరిగే ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారట. ఎన్డీయే కూటమిలో ఉన్న నితిష్‌ను ఇండియా కూటమి తమ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నితీష్‌కు ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు సమాచారం. బాబు తమ కూటమిలో చేరితో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశచూపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇండియా కూటమి కీలక నేతలు చర్చలు జరుపుతున్నారట.