Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..

Womens Cricket

Womens Cricket

మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నేడు దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య 9వ టీ20 మ్యాచ్ జరుగుతున్న వేళ రెండు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులు భారత జట్టు స్పష్టమైన ఆధిక్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 17 సార్లు ఎదురెదురుపడగా, టీమిండియా అత్యంత ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 14 మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే విజయాన్ని అందుకుంది. గత 17 ఏళ్ల కాలంలో భారత్‌పై విజయం సాధించడానికి పాక్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఇరు జట్ల మధ్య టీ20 సమరం 2009 టీ20 ప్రపంచకప్‌తో ప్రారంభమైంది. ఆ తొలి పోరులో పాకిస్తాన్‌ను కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు, 5 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2010 టీ20 ప్రపంచకప్‌లోనూ పాక్‌పై భారత్ పైచేయి సాధించింది. భారత్‌పై పాకిస్తాన్‌కు తొలి విజయం 2012 టీ20 ప్రపంచకప్‌లో దక్కింది, ఆ మ్యాచ్‌లో పాక్ కేవలం 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. అనంతరం భారత్ వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

2016 టీ20 ప్రపంచకప్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా పాకిస్తాన్ 2 పరుగుల తేడాతో భారత్‌పై రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు భారత్‌పై లభించిన మూడో అలాగే చివరి విజయం 2022 ఆసియా కప్‌లో నమోదైంది, అందులో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ చివరి విజయం తర్వాత కూడా భారత్ వరుసగా పాకిస్తాన్‌ను ఓడిస్తూ వస్తోంది. పాక్ సాధించిన ఈ మూడు విజయాల సరళిని పరిశీలిస్తే, భారత్‌ను ఓడించడంలో వారు ప్రతీసారి తీవ్ర శ్రమ పడాల్సి వచ్చిందని స్పష్టమవుతుంది.

ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల స్క్వాడ్‌లను చూస్తే.. భారత జట్టులో హర్మాన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, ప్రతీక్ రావల్, భారతి ఫుల్‌మాలి, రిచా ఘోష్, దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, గుణాలన్ కమలిని, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ ఉన్నారు.

ఇక పాకిస్తాన్ జట్టులో ఫాతిమా సనా నాయకత్వంలో మునీబా అలీ, షవాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జఫర్, సదాఫ్ షమాస్, ఉమ్-ఎ-హానీ, ఏమాన్ ఫాతిమా, తూబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, సాయిరా జబీన్, మోమినా రియాసత్, ఇమాన్ నసీర్, వహీదా అక్తర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.