NTV Telugu Site icon

Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ!

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma Becomes First Indian Batter: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వే జరిగిన రెండో టీ20ల్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా మొదటి సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే అభిషేక్ సెంచరీ బాదాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, కేఎల్ రాహుల్‌లను అతడు అధిగమించాడు. మూడు ఇన్నింగ్స్‌ల వ్యవధిలో దీపక్ సెంచరీ బాదగా.. నాలుగు ఇన్నింగ్స్ వ్యవధిలో రాహుల్ శతకం సాధించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (38) అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ (45), కేఎల్ రాహుల్ (46) తర్వాత అభిషేక్ శర్మ (46) ఉన్నాడు. ఇక ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. 2024లో 18 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 50 సిక్స్‌లు బాదాడు. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. .25 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 45 సిక్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.