Virat Kohli Eye on Sachin Tendulkar’s All Time Record: ప్రపంచ ఆల్ టైం ఫేవరేట్ క్రికెటర్‌లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతూ ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ కూడా కోహ్లీ ఫామ్ ముందు వెనకపడిపోయారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను ఒక్కడే ఏలుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఎవరికీ సాధ్యం కానీ మరెన్నో రికార్డ్స్ తన పేరుపై లిఖించుకున్నాడు. ఇక మరో ఆల్ టైమ్ రికార్డుపై కన్నేశాడు.
టీమిండియాకు దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ కీలక సమయాల్లో జట్టును ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్చాడు. తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించిన కోహ్లీ.. ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. అత్యధిక విజయాల్లో భారత జట్టులో భాగస్వామ్యం వహించిన ఆటగాళ్లలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ విజయంతో రెండో స్థానంకు దూసుకొచ్చాడు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచుకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ 295 మ్యాచ్ విజయాల్లో భాగస్వామ్యం వహించి రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (296) అతడిని దాటేశాడు. 307 మ్యాచ్ విజయాల్లో భాగస్వామ్యం వహించిన సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇంకా 12 మ్యాచ్ విజయాల్లో భాగస్వామ్యం వహిస్తే అగ్రస్థానానికి దూసుకొస్తాడు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన భారత్.. రెండో మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చేరుకున్న రోహిత్ సేన ముమ్మరంగా సాధన చేస్తోంది. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో మంగళవారం నుంచి భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టింది. గురువారం (జులై 20) నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
Also Read: Today Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?