IND vs SL: తిరువనంతపురం వేదికగా జరిగిన నాల్గో మహిళల టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోర్ నమోదు చేయడంతో శ్రీలంకపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువురు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
స్మృతి మంధాన 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు, షఫాలీ వర్మ 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 79 పరుగులు సాధించారు. వీరిద్దరు అవుటైన తర్వాత రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 16 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 16 పరుగులు చేయడంతో జట్టుకు భారీ స్కోర్ అందుకుంది. ఈ ఇన్నింగ్స్ లో స్మృతి మంధాన ఇంటెర్నేషన్ క్రికెట్ లో 10000 పరుగుల మెయిలు రాయిని అందుకుంది. అలాగే షఫాలీ వర్మ వరుసగా మూడో హాఫ్ సెంచరీని నమోదు చేసింది.
ఇక 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో చమరి అథపత్తు 37 బంతుల్లో 52 పరుగులు.. హసిని పెరెరా 33 పరుగులు చేసినా భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయారు. మిగితావారి సహకారం అందకపోవడంతో 191 పరుగులకే పరిమితమైయింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, అరుంధతి రెడ్డిలు చెరో రెండు వికెట్లు తీసి కీలకంగా రాణించారు. ఇదివరకే సిరీస్ కైవసం చేసుకోగా.. దీంతో భారత్ ఈ సిరీస్ 4-0 ఆధిపత్యం మరింత పెంచింది.
