భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం అత్యంత ముఖ్యం. గత 11 ఏళ్లుగా శ్రీలంకపై భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో గణాంకాల పరంగా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 46 టెస్టులు జరగ్గా, భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది, మరో 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
అయితే, ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ మాట్లాడుతూ.. శ్రీలంకకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో పంత్ తక్కువ పరుగులకే నిష్క్రమించినప్పటికీ, కేవలం 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతని సొంతమని కొనియాడారు. అతని ఆక్రమణ శైలి శ్రీలంక బౌలర్లకు పెద్ద సవాలుగా మారుతుందని అన్నారు.
అలాగే.. భారత బ్యాటర్లకు శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ప్రధాన సవాలుగా మారే అవకాశముందని మహరూఫ్ పేర్కొన్నారు. ‘కింగ్ ఆఫ్ గాల్’గా పేరుగాంచిన జయసూర్య గాల్ వేదికగా అత్యధిక వికెట్లు తీసి, అక్కడి గాలుల దిశను అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట అని తెలిపారు. భారత స్పిన్నర్లు కూడా స్థానిక పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం ఈ సిరీస్‌లో కీలక అంశమవుతుందని చెప్పారు. ఏడో స్థానంలో జడేజా రాక భారత్‌కు అదనపు బలాన్ని ఇస్తుందని చెబుతూనే, ఈ రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ముగిసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

