Gautam Gambhir on Ravindra Jadeja: టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. గౌతీ ఆధ్వర్యంలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. జూన్ 27 నుంచి టీ20 సిరీస్, ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. ఇద్దరు టీమిండియాకు సంబందించిన పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. జడ్డూ తమకు అత్యంత కీలక ప్లేయర్ అని, భవిష్యత్తులో టెస్టు సిరీస్‌ల కోసం విరామం ఇచ్చామని స్పష్టం చేశాడు. ‘శ్రీలంక పర్యటన తర్వాత భారత్ 10 టెస్టులు ఆడనుంది. అగ్రశ్రేణి జట్లను ఎదుర్కోవాల్సి ఉండడంతో అత్యంత కఠిన సవాల్ ఎదురుకానుంది. తప్పకుండా అన్ని టెస్టుల్లోనూ విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. రవీంద్ర జడేజా జట్టుకు అత్యంత కీలక ప్లేయర్. 10 టెస్టుల కోసమే అతడికి విశ్రాంతిని ఇచ్చాం. జడ్డూను జట్టు నుంచి తప్పించలేదు. భవిష్యత్తులో టెస్టు సిరీస్‌ల కోసం విరామం ఇచ్చాము’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Also Read: SS Rajamouli: రాజమౌళి ఎవరినీ వదిలిపెట్టడు.. రమా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలోని వన్డే సిరీస్‌కు జడ్డూను ఎంపిక చేయకపోవడంతో.. అతడిని జట్టు నుంచి తప్పించారని, మళ్లీ టీమిండియాలోకి రావడం అసాధ్యం అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వాటిపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. జడేజా భారత్ తరఫున 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు.