Star Players dropped From The India Squad against Sri Lanka Tour: శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూనే.. యువకులకు అవకాశం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. సెలక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. శ్రీలంకతో వన్డేలకు విశ్రాంతి తీసుకుంటారనుకున్న స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అందుబాటులోకి వచ్చారు.
హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా అవకాశం ఇవ్వని బీసీసీఐ.. కనీసం వైస్ కెప్టెన్‌గానూ ఎంపిక చేయలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో సారథిగా వ్యవహరించిన యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. స్టాండ్‌బై కెప్టెన్‌గా గిల్‌ను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ పరోక్షంగా హింట్ ఇచ్చింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు సెలక్ట్ కాలేదు. జింబాబ్వే పర్యటనలో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మకు టీ20 జట్టులో చోటు దక్కలేదు.
రిషబ్ పంత్ రాకతో టీ20 జట్టులో సంజూ శాంసన్ మాత్రమే వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మకు నిరాశ తప్పలేదు. ఐతే శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. గత వన్డే సిరీస్‌లో శాంసన్ సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. రియాన్ పరాగ్ మాత్రం టీ20లతో పాటు వన్డే జట్టులో చోటు సంపాదించాడు. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి మరోసారి నిరాశే మిగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు వన్డే జట్టులో స్థానం దక్కింది.