India Trash Sri Lanka in 2nd T20I: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సొంతం చేసుకుంది. ఆదివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులు కాగా.. 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 81 రన్స్ చేసింది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ (4-26-3)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చివరిదైన మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53; 34 బంతుల్లో 6×4, 2×6) టాప్ స్కోరర్. ఓపెనర్ పాతుమ్ నిశాంక (32) ఆకట్టుకోగా.. కుశాల్ మెండిస్ (10) త్వరగానే పెవిలియన్ చేరాడు. కమిందు మెండిస్ (26), అసలంక (14) పరుగులు చేశారు. శానక (0), హసరంగ (0)లు డకౌట్ అయ్యరు. రవి బిష్ణోయ్ (3/26)తో పాటు అర్ష్‌దీప్ (2/24), హార్దిక్ పాండ్య (2/23), అక్షర్ పటేల్ (2/30) లంకను కట్టడి చేశారు.
భారత ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం పడింది. దాంతో గంటకు పైగా ఆట ఆగింది. అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. శుభమాన్ గిల్ స్థానంలో అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ (0) విఫలమయ్యాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30; 15 బంతుల్లో 3×4, 2×6) ధాటిగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (26; 12 బంతుల్లో 4×4, 1×6), హార్దిక్ పాండ్యా (22 నాటౌట్; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యాక జరిగిన తొలి సిరీస్‌ను భారత్ ఖాతాలో వేసుకుంది.