NTV Telugu Site icon

Suryakumar Yadav: ఇంజిన్ మారిందంతే.. టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుంది!

Suryakumar Yadav Press Meet

Suryakumar Yadav Press Meet

Suryakumar Yadav Heap Praise on Rohit Sharma Captaincy: శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో భారత్ తొలి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్య‌కుయార్ యాద‌వ్ తొలిసారి ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడిన సూర్య టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు ఇష్టమైన కెప్టెన్ రోహిత్ అని.. ఆటగాడిగా, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడుతూ కేవ‌లం ఇంజిన్ మాత్రమే మారిందని, టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుందని సూర్య తెలిపాడు.

టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంపిక చేశాడు. శ్రీలంక పర్యటనలో సూర్య పగ్గాలు చేపడుతున్నాడు. మీడియా సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడుతూ… ‘2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నా. ఇద్దరం కలిసి దాదాపుగా 10 ఏళ్లు ఆడాం. రోహిత్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కెప్టెన్ అంటే ఎలా ఉండాలని హిట్‌మ్యాన్ సారథ్యం చూసే నేర్చుకున్నా’ అని చెప్పాడు.

Also Read: IND vs SL: నేడు శ్రీలంకతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! ఆ ఇద్దరికి మొదటి పరీక్ష

‘రోహిత్ శర్మ గొప్ప నాయ‌కుడు. అతడి లాంటి కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు. హిట్‌మ్యాన్ ఎంతో మంది ఆటగాళ్లకు ఆదర్శం. జట్టులో పెద్దగా ఏ మార్పు లేదు. కెప్టెన్సీలో మాత్రమే మార్పు వచ్చింది. ప్రస్తుతం ఇంజిన్ మాత్రమే మారింది, టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుంది. భారత జట్టు విజయాల కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’ అని సూర్యకుమార్ యాదవ్‌ చెప్పాడు. హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్‌, తనకు మ‌ధ్య ఉన్న అనుబంధం చాలా స్పెష‌ల్ అని చెప్పాడు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా తరఫున ఈ ఇద్దరు ఆడిన విషయం తెలిసిందే.