NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేదు!

Virat Kohli Test

Virat Kohli Test

Vikram Rathore on Virat Kohli’s Practice: సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ తడబడింది. తొలిరోజు కేఎల్‌ రాహుల్‌ (70 బ్యాటింగ్‌; 105 బంతుల్లో 10×4, 2×6) జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కుటుంబ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంతకుముందు ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరమయ్యాడు. అయితే మరింత ప్రాక్టీస్‌ ఉండుంటే.. కోహ్లీ మరికొన్ని పరుగులు చేసేవాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. వీటిపై భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ స్పందించాడు.

విరాట్‌ కోహ్లీకి ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం లేదని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ‘కోహ్లీ స్థాయికి ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై అవగాహన తెచ్చుకోవడానికి కోహ్లీకి ఒక్క సెషన్‌ చాలు. విరాట్ ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేశాడు. కొద్ది రోజులు తక్కువ ప్రాక్టీస్ చేస్తే.. ఏమీ కాదు. కోహ్లీ ఎలా ఆడుతాడో మనం ఇప్పటికే చూశాం. అతడి ఆట గురించి ఆందోళన అనవసరం. సెంచూరియన్‌ మైదానంలో బాగా ఆడాడు. అతడు ఆరు నెలలు రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు దూరమైనట్లు నాకు అనిపించలేదు’ అని రాఠోడ్‌ పేర్కొన్నాడు.

Also Read: Bharat Nyay Yatra: మణిపూర్‌ నుంచి ముంబై వరకు రాహుల్‌ ‘భారత్‌ న్యాయ యాత్ర’!

సెంచూరియన్‌లో మంగళవారం ఆరంభం అయిన తొలి టెస్టు మ్యాచ్‌లో నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్‌ను టోనీ డి జోర్జి జారవిడిచాడు. లైఫ్ దక్కడంతో కోహ్లీ క్రీజులో పాతుకుపోయాడు. అయితే భారీ స్కోర్ చేయడంలో విరాట్ విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా రిప్పర్‌కు బలి అయ్యాడు. లోపలికి దూసుకు వచ్చేలా కనిపించిన బంతిని డ్రైవ్‌ చేసేందుకు విరాట్ చూడగా.. బంతి బయటకు వెళ్తూ బ్యాట్‌ను ముద్దాడి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడింది. అంతకుముందు వరుసగా లోపలకు బంతులు వేసిన రబాడ.. ఈ బంతిని మాత్రం బయటకు వెళ్లేలా వేశాడు. కోహ్లీని టెస్టుల్లో నాలుగోసారి రబాడ బుట్టలో వేసుకున్నాడు.