NTV Telugu Site icon

Suryakumar Yadav: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav Century

Suryakumar Yadav Century

Suryakumar Yadav Equals Rohit Sharma’s Most Centuries Record in T20s: భారత్ తాత్కలిక కెప్టెన్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్య సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సమం చేశాడు.

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే అత్యధిక శతకాలు నమోదు చేశారు. ఈ ఇద్దరు నాలుగేసి శతకాలు బాదగా.. మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ వీరి సరసన చేరాడు. సూర్యకుమార్ 57 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు చేయగా.. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు బాదాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్య ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజామ్ (3), కొలిన్ మున్రో (3) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Also Read: Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్‌ గ్రీన్‌

టీ20ల్లో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాపై ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య.. వరుసగా 50 నాటౌట్, 61, 8, 68, 56, 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి 9 బంతుల్లో 18 పరుగులు చేసిన సూర్యకుమార్.. తర్వాతి 20 బంతుల్లో 17 రన్స్ మాత్రమే బాదాడు. ఇక చివరి 26 బంతుల్లో ఏకంగా 65 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో కూడా సూర్య చెలరేగిన విషయం తెలిసిందే.