NTV Telugu Site icon

IND vs SA: సూర్యకుమార్‌ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం! సిరీస్‌ సమం

Surya, Kuldeep

Surya, Kuldeep

India beat South Africa in 3rd T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్‌ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (100; 56 బంతుల్లో 7×4, 8×6) మెరుపు సెంచరీకి తోడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ (5/17) మయాజాలం తోడవడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ విజయంతో భారత్ పొట్టి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుకుపోగా.. రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ గెలిచింది. ఇక భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (60; 41 బంతుల్లో 6×4, 3×6) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (8), తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ (0) నిరాశపరిచారు. మూడో ఓవర్లో కేశవ్‌ మహరాజ్‌.. గిల్‌, తిలక్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో జైస్వాల్‌కు సూర్యకుమార్ యాదవ్ తోడయ్యాడు. జైస్వాల్‌ దూకుడుగా ఆడినా.. సూర్య నెమ్మదిగా ఆడాడు. తానెదుర్కొన్న తొలి 24 బంతుల్లో 26 పరుగులే చేశాడు. దాంతో భారత్ 10 ఓవర్లకు 87/2 రన్స్ చేసింది. ఆపై సూర్య గేర్‌ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు రింకు సింగ్ (14) తన మార్క్ షాట్స్ ఆడలేదు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

రెండో మ్యాచ్‌లో తేలిపోయిన భారత బౌలర్లు కీలక మ్యాచ్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్లో బ్రీజ్కె (8)ను ముకేశ్‌ బౌల్డ్‌ చేయగా.. ఆపై సిరాజ్‌ త్రోకు హెండ్రిక్స్‌ (8) రనౌటయ్యాడు. ప్రమాదకర బ్యాటర్‌ క్లాసెన్‌ (5)ను అర్ష్‌దీప్‌ ఔట్ చేశాడు. మార్‌క్రమ్‌ (25)ను జడేజా పెవిలియన్‌ చేర్చాడు. ఓ వైపు మిల్లర్‌ (35) నిలిచినా మరో వైపు నుంచి భారత్‌ వికెట్ల వేట కొనసాగిస్తూ పోయింది. కుల్దీప్ వరుస విరామాల్లో వికెట్స్ తీస్తూ దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టాడు. కుల్దీప్ ధాటికి దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.