NTV Telugu Site icon

Rohit Sharma: తొలి ఆసియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు!

Rohit Sharma Test Captain

Rohit Sharma Test Captain

Rohit Sharma Capain Record in Cape Town: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్‌ గెలవలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రం ఇది రెండోసారి. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు ఆ ఘనత సాధించడం ద్వారా ధోనీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఏడుగురు భారత సారథుల నేతృత్వంలో టీమిండియా టెస్టు సిరీస్‌లు ఆడింది. ఇందులో ఇద్దరు కెప్టెన్లు మాత్రమే సిరీస్‌ను డ్రా చేశారు. మిగతా ఐదుగురు కెప్టెన్లు మాత్రం సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నారు. ఇక కేప్‌టౌన్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య మొత్తం 6 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 4 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. మరో 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని 7వ మ్యాచ్‌లో భారత్ తొలి టెస్టు విజయం సాధించింది. అంతేకాదు ఈ ఘనత ఏ ఆసియా కెప్టెన్‌కు సాధ్యం కాలేదు.

Also Read: IND vs SA: సిరాజ్‌ హిందీకి బుమ్రా అనువాదం.. వీడియో వైరల్‌!

భారత్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై 5 టెస్టులు మాత్రమే గెలుచుకుంది. జోహనెస్‌బర్గ్‌లో రెండు గెలవగా.. డర్బన్‌, సెంచూరియన్‌, కేప్‌టౌన్‌లో ఒక్కొ మ్యాచ్ గెలిచింది. దక్షిణాఫ్రికాలో భారత్‌ మొత్తం 25 టెస్టులు ఆడగా.. ఐదు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. భారత్ 13 టెస్టుల్లో ఓటమి పాలవ్వగా.. ఏడింటిని డ్రా చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవలేదు.