Ravi Shastri Hails Vernon Philander: దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి భారత జట్టుకు ఇదే మంచి అవకాశం అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతంలో భారత్ విజయాలను అడ్డుకున్న దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ వెర్నాన్ ఫిలాండర్.. ప్రస్తుతం బరిలోకి దిగకపోవడం రోహిత్ సేనకు కలిసొస్తుందన్నాడు. భారత్‌తో మ్యాచ్ అంటేనే ఫిలాండర్ చెలరేగిపోతాడు. స్వదేశంలో భారత్‌పై కేవలం ఐదు టెస్టుల్లోనే 25 వికెట్లు పడగొట్టాడు. అందుకే రవిశాస్త్రి పై విధంగా పేర్కొన్నాడు. తొలి టెస్టుకు రవిశాస్త్రి, ఫిలాండర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుండడం విశేషం.
స్టార్ స్పోర్ట్స్ ప్రీ-మ్యాచ్ షో సందర్భంగా వెర్నాన్ ఫిలాండర్‌ను చూపిస్తూ రవిశాస్త్రి ఇలా అన్నాడు. ‘దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఇది భారత్‌కు మంచి అవకాశం. ఎందుకో తెలుసా?.. ఈ సిరీస్‌లో వెర్నాన్ ఫిలాండర్ ఆడడం లేదు. దక్షిణాఫ్రికాలో ఆ జట్టును రెండు సార్లు ఓడించేవాళ్లమే. కానీ ఫిలాండర్ వల్లే అది సాధ్యం కాలేదు. మన అవకాశాలను దెబ్బతీశాడు. ఇప్పుడు రబాడ, ఎంగిడి రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ భారత్‌పై ఫిలాండర్ గణాంకాలు బాగున్నాయి. ప్రతిసారీ కీలకమైన వికెట్లను తీసి ఒత్తిడి పెంచాడు’ అని రవిశాస్త్రి అన్నాడు.
Also Read: Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!
2018లో రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లోనే వెర్నాన్ ఫిలాండర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇక మంగళవారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఆరంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) పోరాడుతున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4), శ్రేయస్ అయ్యర్ (31; 50 బంతుల్లో 3×4, 1×6) ఆదుకునే ప్రయత్నం చేశారు.