NTV Telugu Site icon

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌లో బాబర్‌ అజామ్‌ ఆడుతాడా?

Babar Azam

Babar Azam

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్తాన్ జట్ల తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు పాకిస్తాన్ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ డుమ్మా కొట్టాడు. దీంతో భారత్‌తో మ్యాచ్‌లో బాబర్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్‌ నెమ్మదిగా ఆడిన విషయం తెలిసిందే. 90 బంతుల్లో 64 పరుగులు చేయడంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

పాకిస్తాన్ తాత్కాలిక కోచ్‌ ఆకిబ్‌ జావెద్‌ మీడియాతో మాట్లాడుతూ.. బాబర్‌ అజామ్‌ గైర్హాజరీని చిన్న అంశంగా పేర్కొన్నాడు. బాబర్‌ ప్రాక్టీస్ సెషన్‌ నుంచి రెస్టు కావాలని కోరినట్లు తెలిపాడు. భారత్‌తో మ్యాచ్‌లో బాబర్‌ ఆడుతాడని స్పష్టం చేశాడు. టీమిండియాపై బాగా ఆడుతాడనే ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్‌ విషయంలో పాక్‌ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఇందుకు కారణం ఇటీవల భారత్ చేతిలో ఓడిపోవడమే. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆటగాళ్లతో సమావేశమయ్యారు. జట్టు సెలక్షన్‌పై పీసీబీ చీఫ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు దుబాయ్ వెళ్లారు.

బంగ్లాపై ఘన విజయంతో టీమిండియా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్‌పై కూడా గెలిచి టోర్నీలో ముందంజ వేయాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్‌ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఈ నేపథ్యంలో పాక్ గట్టిగానే పోరాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో దాయాది జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో పాక్‌ మూడు సార్లు నెగ్గగా.. రెండు సార్లు భారత్‌ విజయం సాధించింది.