Site icon NTV Telugu

IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితం!

Suryakumar Yadav

Suryakumar Yadav

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఉగ్రవాద దాడి బాధితు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నా అని తెలిపాడు. బాధిత కుటుంబాలకు భారత జట్టు తరఫున సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నాడు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు సూర్య ధన్యవాదాలు తెలిపాడు. భారతదేశానికి ఈ విజయం ఒక అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ అని పేర్కొన్నాడు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత ఫాన్స్ డిమాండ్లు చేశారు. ‘బాయ్‌కాట్ ఆసియా కప్‌ 2025’ అని ట్రెండ్ చేశారు. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే మ్యాచ్ ఆడుతున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఎట్టకేలకు ఆదివారం మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో, మ్యాచ్ అనంతరం కూడా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని మరో 25 బంతులుండగానే.. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ ఛేదించింది. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

‘ఈ విజయం నాకు అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఇది భారత్‌కు నేను ఇవ్వగలిగిన ఉత్తమ రిటర్న్ గిఫ్ట్ అని భావిస్తున్నాను. ఒకసారి మనసులో ఆలోచన పుడితే.. గెలవాలన్న కోరిక తప్పనిసరిగా వెంటాడుతుంది. గెలిచాక ఆ ఆనందం వర్ణనాతీతం. ముఖ్యంగా చివరివరకు నిలబడి బ్యాటింగ్‌ చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక. మా జట్టుకు ఇది ఓ సాధారణ మ్యాచ్‌ లాంటిదే. మేం ఏ జట్టును ఎదుర్కొన్నా ఒకే విధంగా ప్రిపేర్ అవుతాం. కొన్ని నెలల క్రితం స్పిన్‌ బౌలర్లతోనే చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. వ్యక్తిగతంగా నాకు ఎప్పుడూ స్పిన్నర్లంటే ఇష్టం. ఎందుకంటే మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను కంట్రోల్ చేయగల సామర్థ్యం వారికే ఉంటుంది’ అని చెప్పాడు.

‘ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. పహల్గాం టెర్రర్‌ అటాక్‌ బాధిత కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం. మేము మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితం ఇస్తున్నాం. వారు చూపించిన వీరత్వం ఎప్పుడూ మాకు ప్రేరణ. భవిష్యత్తులోనూ వారిని గర్వపడేలా, మైదానంలో మరిన్ని విజయాలు సాధించి.. వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తునే ఉంటాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

Exit mobile version