Site icon NTV Telugu

IND vs PAK: పోస్ట్ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌కు పాక్ కెప్టెన్ డుమ్మా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో దాక్కొని!

Salman Agha

Salman Agha

భారత్ చేతిలో దాయాది పాకిస్థాన్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 25 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో దారుణంగా విఫలమై భారీ మూల్యం చెల్లించుకుంది. దారుణ ఓటమి నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఏకంగా పోస్ట్ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టాడు.

భారత్‌తో మ్యాచ్‌కు ముందు తాము ఎవరినైనా ఓడిస్తామని గొప్పలు చెప్పుకున్న సల్మాన్ అఘా.. ఓటమి తర్వాత కనీసం ప్రెజెంటేషన్‌లో మాట్లాడేందుకు కూడా రాలేదు. ఓటమి బాధలో ఉన్న అతడు నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్స్ పోస్ట్ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో పాల్గొనడం సంప్రదాయం. కానీ పాక్ కెప్టెన్ దారుణ ఓటమిని జీర్ణించుకోలేక పోస్ట్ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టాడు. ‘ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టి డ్రెస్సింగ్‌ రూమ్‌లో దాక్కొన్నాడు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్‌ కోచ్ మైక్ హెసెన్ స్పదించాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందని కవర్ చేశాడు.

Also Read: IND vs PAK: పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ప్రత్యేకమైన నిరసన.. శభాష్ సూర్యకుమార్!

‘కెప్టెన్ సల్మాన్ అఘా ప్రెజెంటేషన్‌లో మాట్లాడలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. మ్యాచ్‌ అనంతరం మేము కరచాలనం చేయాలని భావించాం. అందుకు అందరం సిద్ధమయ్యాం. కానీ భారత్‌ అందుకు అంగీకరించలేదు. భారత్ ప్లేయర్స్ అందరూ నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయారు. ఇలా మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచింది. ఈ మ్యాచ్‌లో మా ఆట ఏమాత్రం బాగోలేదు. అన్ని విభాగాల్లో తేలిపోయాం. చాలా నిరాశగా ఉంది. ప్లేయర్స్ అందరూ నిరుత్సాహంగా ఉన్నారు’ అని పాక్ కోచ్ మైక్ హెసెన్ చెప్పాడు.

Exit mobile version