Site icon NTV Telugu

IND vs PAK: అభిషేక్ బచ్చన్‌ను త్వరగా అవుట్ చేస్తే.. పాకిస్థాన్‌ ఈజీగా గెలుస్తుంది: అక్తర్

Abhishek Akhtar

Abhishek Akhtar

ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడున్నాయి. సెప్టెంబర్ 28న జరగనున్న ఫైనల్‌లో ఇండో-పాక్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-4 మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ ఘన విజయాలు సాధించింది. ఫైనల్‌లోనూ పాక్‌ను చిత్తు చేసి టైటిల్ పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్‌ ఢీకొట్టలేదు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఫైనల్ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేస్తే భారత్‌ను ఓడించవచ్చని తన జట్టుకు సూచించాడు.

క్రికెట్ టాక్ షో గేమ్ ఆన్ హైలో పాల్గొన్న షోయబ్ అక్తర్.. భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌పై మాట్లాడుతూ పప్పులో కాలేశాడు. పాకిస్తాన్ బౌలర్లు అభిషేక్ బచ్చన్‌ను త్వరగా ఔట్ చేస్తే.. మిడిల్ ఆర్డర్‌తో భారత్ ఏమీ చేయలేదు అని అన్నాడు. అక్తర్ అలా అనగానే హోస్ట్ సహా ప్యానెలిస్టులు అందరూ పగలబడి నవ్వారు. వేంటనే అక్తర్ తన తప్పును సరిదిద్దుకున్నాడు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ కాదు.. క్రికెటర్ అభిషేక్ శర్మ అని చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్తర్‌ను టీమిండియా ఫాన్స్ ఆడుకుంటున్నారు. ‘మీరు అభిషేక్ బచ్చన్‌ను అవుట్ చేయండి’, ‘మీకు ఫ్రీ వికెట్ ఇస్తాం’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: CM Chandrababu: గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, యాక్సంచర్‌.. ఐటీ హబ్‌గా విశాఖ!

‘టీమిండియాతో మ్యాచ్ అంటే పాకిస్థాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మైండ్‌‌సెట్ నుంచి బయటకు రావాలి. బంగ్లాదేశ్‌పై ఎలా ఆడారో.. టీమిండియాపై అలానే ఆడాలి. మొత్తం 20 ఓవర్లు బౌలింగ్ చేయాలని చూడకుండా.. 10 వికెట్లు తీసేందుకు పాక్ బౌలర్లు ప్రయత్నించాలి. అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేయాలి. అప్పుడే టీమిండియాపై ఒత్తిడి పెరుగుతుంది. టోర్నీలో భారత్ మిడిల్ ఆర్డర్‌ పెద్దగా రాణించలేదు. అభిషేక్ మంచి ఆరంభాలు ఇచ్చాడు. అతడిని 3-4 ఓవర్లలో ఔట్ చేయకపోతే పాకిస్థాన్‌ గెలవడం కష్టం. అభిషేక్ త్వరగా పెవిలియన్ చేరితే.. మిగతా బ్యాటర్లు ఆచితూచి ఆడుతారు. ఫైనల్లో పాక్ బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version