IND vs NZ Final: క్రికెట్ ప్రపంచం మరో మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ వేటలో భారత జట్టు ఆఖరి మెట్టుపై నిలిచింది. హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అంత సులువు కాదనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కివీస్ ఫామ్ చూస్తుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లు సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు నుంచి టీమిండియాను ముంచే ముల్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
విధ్వంసక బ్యాటర్లు ఒకెత్తయితే.. ఆ స్పిన్నర్ మరొకెత్తు!
న్యూజిలాండ్ జట్టులో ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ, భారత బౌలర్లు వారిని కట్టడి చేయగలరనే నమ్మకం ఉంది. కానీ, టీమిండియా బ్యాటర్లకు అసలైన సవాలు విసిరేది మాత్రం కివీస్ స్పిన్ అస్త్రం, భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర. సాధారణంగా రచిన్ రవీంద్ర బ్యాటర్‌గా గుర్తింపు పొందినప్పటికీ, ఈ ప్రపంచ కప్‌లో బౌలర్‌గా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 6.88 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టి కివీస్ తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ మ్యాచ్ విన్నర్‌గా మారుతున్నాడు.
ఒకప్పుడు స్పిన్ ఆడటంలో భారతీయులు దిట్టలు అనే పేరు ఉండేది. కానీ ఇటీవల కాలంలో టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో తడబడుతున్నారు. ఈ టోర్నమెంట్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎక్కువ సార్లు స్పిన్నర్లకే వికెట్ పారేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లను ఎడమచేతి వాటం స్పిన్నర్లతో కట్టడి చేయడం కివీస్ ప్లాన్‌గా తెలుస్తుంది. రచిన్ రవీంద్రకు భారత పిచ్‌లపై ఉన్న అపారమైన అవగాహన (IPL అనుభవం) అతడిని మరింత ప్రమాదకారిగా మారుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే, రచిన్ రవీంద్ర భారత జట్టు విజయానికి అడ్డుగోడలా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. స్వదేశీ గడ్డపై ఆడుతున్నప్పటికీ, కివీస్ జెర్సీ ధరించిన ఈ భారత సంతతి ఆటగాడిని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత విజయానికి కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
READ ALSO: Sundar Pichai: గూగుల్ పిచాయ్‌కు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చు తెలుసా!