Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సెమీస్‍లో గెలిచి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే సయమంలో వాంఖడే స్టేడియంలో దారుణమైన ఘటన చోటుచేసుకోనుంది అని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్స్ (ట్విటర్)లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. తన పోస్ట్‌లో ముంబై పోలీసులను ట్యాగ్ చేసిన ఆ వ్యక్తి.. తుపాకీ, హ్యాండ్‌గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దాంతో దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
Also Read: IND vs NZ Semi Final 2023: ఒక్క డబుల్ డిజిట్ లేదు..సెమీస్ అంటే ‘కింగ్’ కోహ్లీకి వణుకా?
వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడి చేస్తామంటూ అప్పుడు ఓ ఈ-మెయిల్ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మైదానంలో హాయిగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు ఈ న్యూస్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.