Virat Kohli have bad record inSemi Final matches in ODI World Cups: ప్రపంచ మేటి బ్యాటర్‌లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా మనోడికి సంబంధం లేదు.. పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అద్భుత బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో కూడా విరాట్ పరుగుల వరద పారిస్తున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 594 రన్స్ చేసిన కింగ్.. టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. నేడు న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా విరాట్ రాణిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సెమీస్ అంటే ‘కింగ్’ కోహ్లీ (Virat Kohli Semi Final Phobia) వణికిపోతున్నాడు.
వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ రికార్డు బాగలేదు. టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లలో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్న కోహ్లీ.. తనకు బాగా అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో మాత్రం తడబడ్డాడు. ఇప్పటివరకు 3 సార్లు వన్డే ప్రపంచకప్ సెమీస్ ఆడిన కింగ్.. ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. 2011లో పాకిస్తాన్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ మ్యాచ్‌లో ఒక్క పరుగే చేసిన కోహ్లీ.. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు.
వన్డే వరల్డ్‌కప్ మూడు సెమీస్ మ్యాచ్‌లలో కలిపి విరాట్ కోహ్లీ చేసింది కేవలం 11 పరుగులే. ఈ పరుగులు చూస్తే.. సెమీస్ మ్యాచ్ ‘కింగ్’ కోహ్లీకి కలిసి రావడం లేదనిపిస్తోంది. అంతేకాదు ఈ మూడు సార్లు కూడా ఎడమ చేతి వాటం పేసర్ల బౌలింగ్‌లోనే విరాట్ పెవిలియన్ చేరడం గమనార్హం. నేటి మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్‌ను కోహ్లీ ఎదుర్కోవాల్సి ఉంది. ఈసారైనా కోహ్లీ సెమీస్ గండాన్ని అధిగమిస్తాడో లేదో చూడాలి. కింగ్ భారి ఇన్నింగ్స్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. తనపై ఉన్న ఈ చెత్త రికార్డును చెరిపేయాల్సిన బాధ్యత కోహ్లీపై ఉంది.