NTV Telugu Site icon

IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే

Sarfaraz, Kohli

Sarfaraz, Kohli

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్‌ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్‌ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్‌లపైనే ఉంది. గాయపడిన రిషబ్ పంత్ మైదానంలోకి దిగుతాడో లేదో చూడాలి.

మూడోరోజు 180/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 402 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ రచిన్‌ రవీంద్ర (134; 157 బంతుల్లో 13×4, 4×6) అద్భుత శతకం బాదాడు. పేసర్ టీమ్ సౌథీ (65; 73 బంతుల్లో 5×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/72), కుల్దీప్ యాదవ్‌ (3/99) చెరో మూడు వికెట్స్ పడగొట్టారు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), యశస్వి జైస్వాల్‌ (35; 52 బంతుల్లో 6×4) మంచి ఆరంభం ఇచ్చారు. అయితే ఈ ఇద్దరినీ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ పెవిలియన్ చేర్చాడు.

Also Read: T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో విండీస్‌పై విజయం.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్‌!

సర్ఫరాజ్‌ ఖాన్ (70 బ్యాటింగ్‌; 78 బంతుల్లో 7×4, 3×6) క్రీజులోకి రాగానే ధాటిగా ఆడాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6) బాగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ ఇద్దరు జట్టు స్కోరును 200 దాటించారు. దాంతో మరో వికెట్‌ కోల్పోకుండా భారత్‌ రోజును ముగించేలా కనిపించింది. కానీ ఆటలో చివరి బంతికి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్‌ ఇచ్చి ఇచ్చాడు. ఇది భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. నేడు ఎదురుదాడే మంత్రంగా ఆడితే భారత్ సక్సెస్ అవ్వొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.