NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. జట్టును ప్రకటించకపోవడానికి కారణం ఆ ముగ్గురే!

Virat Kohli Test Shot

Virat Kohli Test Shot

Delay in BCCI announcing India Squad not because of Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. సెలక్షన్ కమిటీ గురువారం వర్చువల్‌గా సమావేశం అయినా.. జట్టును ప్రకటించలేదు. నేడు మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టును ప్రకటించడంలో ఆలస్యానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ భారత జట్టును ప్రకటించకపోవడానికి కారణం విరాట్ కాదట.

ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు తాను అందుబాటులో ఉండేది లేనిది బీసీసీఐకి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెప్పలేదట. విరాట్ సమాధానం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందని, అందుకే జట్టును ప్రకటించడంలో ఆలస్యం అవుతోందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ‘విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కారణంగానే ఇంకా జట్టును ప్రకటించలేదు. మూడో టెస్టుకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. అందుకే జట్టును ప్రకటించేందుకు సెలక్టర్లు హడావుడి చేయడం లేదు. మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భావించింది. అయితే రాజ్‌కోట్‌లో ఆడాలని సెలక్టర్లు చెబుతున్నారు’ అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.

Also Read: Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!

లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాల ఫిట్‌నెస్ నివేదిక కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందట. మొదటి టెస్టులో ఆడిన ఈ ఇద్దరు.. గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. బెంగళూరులోని ఎన్‌సీఏలో రాహుల్, జడేజాలకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రాహుల్, జడేజా, కోహ్లీ అందుబాటులో ఉంటే.. రజత్ పటిదార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది.