భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ సిరీస్ నేపథ్యంలో, భారత్-ఇంగ్లాండ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రత్యేకమైన జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఉండగా, భారత్ నుండి ముగ్గురు స్టార్ ప్లేయర్లు చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ జాబితాలో ఇంగ్లాండ్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ 28 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌పై ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 28 సిక్సులు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం నుండి ప్రారంభం కాబోయే సిరీస్‌లోనూ బట్లర్ ఆడుతుండటంతో తన రికార్డును మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో స్థానంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై 21 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 27 సిక్సర్లతో బట్లర్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే, ప్రస్తుతం తొడ గాయం కారణంగా కోలుకుంటున్న పాండ్యా.. ఈ సిరీస్‌కు దూరం కావడం గమనార్హం.
ఈ లిస్టులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మూడో స్థానంలో నిలిచాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికేస్తూ ఏకంగా 22 సిక్సర్లు బాదాడు. రేపటి నుండి ప్రారంభమయ్యే సిరీస్‌లో అభిషేక్ శర్మ నెం.1 స్థానాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జేసన్ రాయ్ 15 మ్యాచ్‌ల్లో 20 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉండగా, టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 21 మ్యాచ్‌ల్లో 19 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. రేపటి సిరీస్‌లో అభిషేక్ శర్మ, జోస్ బట్లర్ మధ్య సిక్సర్ల సమరం ఆసక్తికరంగా మారనుంది.

