England Needs 35 Runs, India 4 Wickets for Win In IND vs ENG 5th Test: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజుకు చేరుకోగా.. ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కాస్త ముందే ముగియగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (0) క్రీజులో ఉన్నారు. మరోవైపు విజయానికి భారత్‌కు 4 వికెట్లు కావాలి. గాయపడిన క్రిస్ వోక్స్ ఆడకపోతే.. 3 వికెట్లే చాలు. ఈ నేపథ్యంలో నేటి మొదటి సెషన్ ఆట ఎంతో ఆసక్తికరంగా మారింది. భారత్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేస్తుందో లేదో చూడాలి.
భారీ లక్ష్యాన్ని నిర్దేశించి.. ఎన్నో ఆశలతో నాలుగో రోజు బరిలోకి దిగిన భారత్‌కు నిరాశే ఎదురైంది. డకెట్ (54), పోప్ (27) త్వరగానే అవుట్ అయినా.. హ్యారీ బ్రూక్ (111; 98 బంతుల్లో 14×4, 2×6), జో రూట్ (105; 152 బంతుల్లో 12×4)లు శతకాలతో ఇంగ్లండ్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. బ్రూక్ ధాటిగా బ్యాటింగ్‌తో భారత్ ఆశలు సన్నగిల్లాయి. అయితే బ్రూక్ అవుట్ చేసి ఆకాశ్ దీప్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. కాసేపటికి ప్రసిద్ధ్ వరుస ఓవర్లలో బెతెల్ (5), రూట్‌ను ఔట్ చేయడంతో భారత్ పోటీలోకి వచ్చింది. ఆపై పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జేమీ స్మిత్, ఒవర్టన్‌లపై ఒత్తిడి పెంచారు. దాంతో పరుగులు రాబట్టడం ఇద్దరికీ కష్టమైపోయింది.
Also Read: Horoscope Today: సోమవారం దినఫలాలు.. ఆ రాశి వారు నేడు తస్మాస్ జాగ్రత్త!
అయితే వెలుతురులేమి కారణంగా ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కూడా పడింది. దీంతో నాలుగో రోజు ఆట ముందుగానే ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అయితే గాయం కారణంగా క్రిస్ వోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు దిగలేదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రావడం అనుమానమే. మరో 3.4 ఓవర్లలో కొత్త బంతి రానుండడం టీమిండియాకు కలిసొచ్చే విషయమే. ఈరోజు ఆరంభంలోనే భారత్ పేసర్లు చెలరేగితే మ్యాచ్ సొంతమవడమే కాకుండా.. సిరీస్ 2-2తో సమం అవుతుంది.