NTV Telugu Site icon

IND vs IND 2nd Test: గాయాలతో రాహుల్‌, జడేజా ఔట్‌.. సర్ఫరాజ్‌, సుందర్‌లకు ఛాన్స్‌!

India Test Team

India Test Team

Sarfaraz Khan earns maiden call-up from Team India: తొలి టెస్టు ఓటమితో ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడ్డ భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయాల కారణంగా విశాఖలో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో సింగిల్‌ తీసే ప్రయత్నంలో జడేజాకు తొడకండరాలు పట్టేయగా.. రాహుల్‌ కుడి తొడ నొప్పితో బాధపడుతున్నాడు. ‘రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్‌లు ఫిబ్రవరి 2న విశాఖలో ఆరంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యారు. బీసీసీఐ వైద్య బృందం వారి పురోగతిని పర్యవేక్షిస్తోంది’ అని సోమవారం బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

సీనియర్‌ ప్లేయర్స్ దూరమైన నేపథ్యంలో అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ముగ్గురు ఆటగాళ్లను రెండో టెస్టుకు ఎంపిక చేసింది. ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌లు జట్టులోకి వచ్చారు. జాతీయ జట్టులో చోటుతో సర్ఫరాజ్‌ అరంగేట్ర నిరీక్షణ తెరపడింది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించినప్పటికీ సెలక్టర్లను నుంచి సర్ఫరాజ్‌కు పిలుపు రాకపోవడంతో.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చివరకు అతడికి అవకాశం వచ్చింది.

గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్‌ రంజీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సర్ఫరాజ్ ఓ ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. అయితే రెండో టెస్టులో సర్ఫరాజ్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఇప్పటికే 15 మంది సభ్యుల జట్టులో ఉన్న రజత్ పటీదార్‌ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Honey Rose: బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?

రెండో టెస్టుకు భారత జట్టు:
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, కేఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌, ఆర్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్‌ ఖాన్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్, వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌.