NTV Telugu Site icon

Virat Kohli-Ravindra Jadeja: నన్ను క్షమించేసేయ్ జడేజా.. అది అలా జరిగిపోయింది: విరాట్ కోహ్లీ

Virat Kohli Ravindra Jadeja

Virat Kohli Ravindra Jadeja

Virat Kohli Says Sorry to Ravindra Jadeja for stealing Man of the Match Award: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. జడేజాకు దక్కాల్సిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డును తాను లాగేసుకున్నందుకు సారీ చెప్పాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసి 38 రన్స్ ఇచ్చాడు. అంతేకాదు కళ్లు చెదిరే క్యాచ్‌తో బంగ్లా కీలక బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు జడ్డూకే అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఛేదనలో కింగ్ కోహ్లీ ఊహించని శతకం చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘జడేజా.. నీ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను లాక్కున్నందుకు నన్ను క్షమించు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాలనుకున్నాను కానీ.. సెంచరీ చేస్తాననుకోలేదు. అది అలా జరిగిపోయింది. ప్రపంచకప్‌లలో హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. వాటిని సెంచరీలుగా మార్చలేకపోతున్నా. ఈ మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో ఉండి భారత జట్టుకు విజయాన్ని అందించాలనుకున్నా. ఇది నేను జట్టు కోసం సంవత్సరాలుగా చేస్తున్నా. ఈ మ్యాచ్‌లో మంచి స్టార్ట్ లభించింది. రెండు నోబాల్స్ లను ఫోర్, సిక్స్‌గా మలచడం గొప్పగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దాంతో నా సహజ గేమ్ ఆడాను. గ్యాప్‌లలో బౌండరీలు బాదడం, సింగిల్స్ తీయడంతో పరుగులు వచ్చాయి’ అని తెలిపాడు.

Also Read: Virat Kohli-KL Rahul: జనాలు తిడుతారని విరాట్ కోహ్లీ అన్నాడు.. నేనే పట్టుబట్టా: కేఎల్‌ రాహుల్‌

‘డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉంది. ఒకరికొరు అన్యోన్యంగా ఉంటున్నాం. దాని ఫలితమే మైదానంలో కనబడుతోంది. ఇది సుదీర్ఘ టోర్నీ అని తెలుసు. ఓ మూమెంటమ్‌ను క్రియేట్ చేసి.. దాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం. అందరూ విజయం కోసం కష్టపడుతున్నారు. సొంతగడ్డపై, ఇంతమంది ఫాన్స్ ముందు మ్యాచులు ఆడటం ప్రత్యేకమైన అనుభూతి. ఇదే జోరును కొనసాగించాలని మేం భావిస్తున్నాం’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా లీగ్ దశలో న్యూజీలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో భారత్ ఆడాల్సి ఉంది. వచ్చే రెండు మ్యాచులలో రోహిత్ సేనకు గట్టి పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.