NTV Telugu Site icon

IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. జాగ్రత్త సుమీ! వీళ్లతోనే ముప్పు

Ind Vs Ban 1st Test

Ind Vs Ban 1st Test

సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన ఈ సిరీస్‌ను గెలవాలని టీమిండియా చూస్తోంది. సొంతగడ్డపై సిరీస్‌ కాబట్టి రోహిత్ సేనకు గెలుపు లాంఛనమే. అయితే ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో బంగ్లా మట్టికరిపించింది. పాకిస్థాన్‌లో ఇంతకుముందు ఒక్క టెస్టూ గెలవని బంగ్లా ఏకంగా సిరీస్‌నే క్లీన్‌స్వీప్‌ చేసి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో భారత గడ్డపై అడుగుపెట్టింది. బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు.

భారత్‌లో సిరీస్‌ అంటే స్పిన్నర్లదే ఆధిపత్యం. ప్రత్యర్థి జట్లు మన స్పిన్నర్ల వలలో చిక్కుకుని సిరీస్‌లు కోల్పోతుంటాయి. ఉపఖండ టీమ్స్ కూడా భారత్‌ ముందు నిలవలేవు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ మాత్రం ఇందుకు మినహాయింపు. ప్రస్తుతం ఆ జట్టులో ప్రమాదకర స్పిన్నర్లు ఉన్నారు. మెహిదీ హసన్‌ మిరాజ్, షకిబ్‌ అల్‌హసన్‌ల నుంచి భారత బ్యాటర్లకు పెను ముప్పు పొంచి ఉంది. పాకిస్థాన్‌పై మిరాజ్‌ రెచ్చిపోయాడు. రెండు టెస్టుల్లోనూ చెలరేగి (9 వికెట్స్) పాక్ నడ్డి విరిచాడు. బ్యాటుతో 77, 78 పరుగులు చేశాడు.

షకిబ్‌ అల్‌హసన్‌ ఎంతటి ప్రమాదక ఆల్‌రౌండరో మనకు తెలిసిందే. పాక్‌పై బ్యాటింగ్‌లో విఫలమైనా.. బంతితో రాణించాడు. భారత వికెట్లపై అంతర్జాతీయ మ్యాచ్‌లకు తోడు ఐపీఎల్‌ అనుభవం కూడా ఉంది. స్పిన్‌కు అనుకూలించే చెన్నై, కాన్పూర్‌ పిచ్‌లపై షకిబ్‌ రెచ్చిపోనున్నాడు. షకిబ్‌, మెహిదీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు ఇంకా అనుకూలం కాబట్టి బంగ్లా మరో స్పిన్నర్‌ను కూడా ఆడించే అవకాశాలు ఉన్నాయి. తైజుల్, నయీమ్‌ల రూపంలో మరో ఇద్దరు ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు.

Also Read: Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!

పేస్ బౌలర్లు తస్కిన్‌ అహ్మద్, నహిద్‌ రాణా మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్, లిటన్‌ దాస్‌ కీలకం. పాక్‌పై ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో సైతం ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్‌లు షకిబ్, మెహిదీ కూడా కీలక పాత్ర పోషించగలరు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో బంగ్లా పటిష్టంగా ఉన్న బంగ్లాను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం తప్పదు.

 

Show comments