Sanju Samson Comes Opener in Gwalior T20: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ పొట్టి సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాత్రి 7.30కు గ్వాలియర్‌లో మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ అవకాశం అనే చెప్పాలి. తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ ప్రణాళికలను వెల్లడించాడు.
అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ‘అభిషేక్, శాంసన్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారు. గ్వాలియర్‌లో మేము రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. వికెట్ మరీ లోగా లేదు, స్లోగా కూడా లేదు. టీ20 మ్యాచ్‌కు సరిపోయే పిచ్ ఇది. మ్యాచ్ ఏకపక్షంగా మాత్రం ఉండబోదనే నేను అనుకుంటున్నా. ప్రస్తుతం జట్టులో అందరూ యువ ఆటగాళ్లే ఉన్నారు. అందరిలో ఓ ప్రత్యేకత ఉంది. మయాంక్ యాదవ్ ఎక్కువగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. అతడి ఆట తీరు ఎలా ఉంటుందో అందరం చూశాం. మయాంక్ రాక వల్ల బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. జట్టుకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో మయాంక్ ఎక్స్ ట్రా పేస్‌ను మనం చూశాము. కాబట్టి అందరి దృష్టి అతడిపైనే ఉంటుంది. జట్టులోని మిగతా యువ ఆటగాళ్లు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని సూర్య చెప్పాడు.
Also Read: BMW M4 CS Price: బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ లాంచ్.. ధర రూ.1.89 కోట్లు!
భారత్ తరఫున ఆడిన 30 టీ20ల్లో ఐదుసార్లు సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడాడు. 2022లో ఐర్లాండ్‌పై 77 పరుగుల నాక్ మినహా.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. కానీ ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్‌గా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం రాయల్స్‌కు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఉన్నారు కాబట్టి నెం.3లో సంజూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిన సందర్భాల్లో సంజూ జట్టును చాలాసార్లే ఆదుకున్నాడు. అది ఇప్పుడు అతడికి కలిసిరానుంది.