Nahid Rana About IND vs BAN Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ జట్టు సిద్ధంగా ఉందని ఆ జట్టు యువ పేసర్ నహిద్ రాణా చెప్పాడు. భారత్ బలమైన జట్టే కానీ.. మెరుగ్గా ఆడిన టీమ్ గెలుస్తుందన్నాడు. భారత్‌కు వెళ్లాక చూసుకుందాం అని నహిద్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై నహిద్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో బుల్లెట్ బంతులతో ఆకట్టుకున్నాడు. 150 కిమీ వేగంతో బంతులు సంధించాడు. తాజాగా పాకిస్థాన్‌తో సిరీస్‌లో మరింత విజృంభించాడు. 21 ఏళ్ల స్పీడ్ సంచలనం రావల్పిండిలో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ‘ఎక్స్’లో షేర్ చేసిన వీడియోలో నహిద్ రాణా మాట్లాడాడు. టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటర్లకు తన బౌలింగ్‌లో తిప్పలు తప్పవని అంటున్నాడు. ‘భారత్‌తో సిరీస్‌కు మా జట్టు బాగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాం. నెట్స్‌లో ఎక్కువ కష్టపడితే మ్యాచ్‌ల్లో రాణించొచ్చని అర్థమైంది. భారత్ బలమైన జట్టే కానీ మెరుగ్గా ఆడిన టీమ్ గెలుస్తుంది. భారత్‌కు వెళ్లాక చూసుకుందాం’ అని నహిద్ పేర్కొన్నాడు. రాణా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: AFG vs NZ: అఫ్గాన్ మైదానాలే బెటర్.. బీసీసీఐకి అఫ్గానిస్థాన్ సెటైర్లు!
పాకిస్థాన్‌ను 2-0తో చిత్తు చేయడంలో నహిద్ రాణా కీలకపాత్ర పోషించాడు.150 కిమీ వేగంతో స్థిరంగా బంతులు వేస్తూ.. బాబర్ అజామ్, మొహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్ లాంటి స్టార్ బ్యాటర్లను కూడా ఇబ్బందిపెట్టాడు. భారత్‌లో కూడా శ్రీలంక, పాకిస్థాన్‌పై ప్రదర్శననే పునరావృతం చేయాలని చూస్తున్నాడు. కొత్త బౌలర్‌కు దాసోహమవడం భారత బ్యాటర్లకు అలవాటే. ఇటీవల శ్రీలంక పర్యటనలో కూడా ఇదే జరిగింది. మరి నహిద్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.