Kanpur Pitch Report for India vs Bangladesh 2nd Test: సాధారణంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. స్పిన్నర్లు చెపాక్‌లో పండగ చేసుకుంటారు. అయితే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మాత్రం బంతి బాగా బౌన్స్ అయింది. ఎన్నడూ లేనివిధంగా పేసర్లు ప్రమాదకరంగా మారారు. తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలుగా మారింది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా మొదలైంది. చెన్నైలో పేసర్లు అంత జోరు చూపించడం ఆటగాళ్లకే కాదు అభిమానులకూ ఆశ్చర్యాన్ని కలిగించింది. చెపాక్‌లో ముంబై నుంచి ఎర్రమట్టి తెచ్చి కొత్తగా ఓ పిచ్‌ను తయారు చేయడమే ఇందుకు కారణం. ఇక రెండో టెస్టుకు వేదిక కానున్న కాన్పూర్‌లో వికెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
రెండో టెస్టు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. ఇరుజట్లు గ్రీన్‌పార్క్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తాయి. 27న టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. కాన్పూర్ పిచ్ సంప్రదాయ శైలిలోనే స్పందిస్తుందని తెలుస్తోంది. ఎప్పట్లాగే బ్యాటర్ల హవా నడుస్తుందని, పరుగుల వరద పారుతుందట. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. కాన్పూర్‌లో పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ కాదు. దీంతో బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడొచ్చు. అయితే మ్యాచ్ సాగేకొద్దీ బంతి బాగా తిరుగుతుంది. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు సహకరిస్తుంది.
Also Read: T20 World Cup 2024: అందరూ మహిళలే.. టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్ట్ ఇదే! ఏపీ నుంచి ఒకరు
కాన్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తుది జట్టులో మార్పు చేసే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగగా.. కాన్పూర్‌లో ఒక పేసర్‌ను తగ్గించుకుని మూడో స్పిన్నర్‌ను ఆడించేందుకు అవకాశం ఉంది. భారత్ తరఫున ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. బ్యాటింగ్ బలోపేతం కోసం ఆల్‌రౌండర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ వైపు మొగ్గుచూపొచ్చు. నహిద్ రాణా స్థానంలో తైజుల్ ఇస్లామ్‌ను బంగ్లాదేశ్ ఆడించొచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్‌హసన్ ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ అతడు అందుబాటులో లేకుంటే.. నయీమ్ తుది జట్టులోకి వస్తాడు.