మహిళల ప్రపంచకప్ 2025 రెండవ సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 29) నవీ ముంబైలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సెమీస్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌కు వరుణ దేవుడు అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా మేఘావృతమై ఉంటుందని ముంబై వాతావరణ శాఖ తెలిపింది.
నవీ ముంబైలో బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ వర్షంతో ప్రభావితమైంది. కీలక సెమీఫైనల్లో కూడా వర్షం కీలక పాత్ర పోషించనుందని సమాచారం. అడపాదడపా వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. గురువారం మ్యాచ్ కొనసాగకున్నా.. ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షం నేపథ్యంలో ప్రతి నాకౌట్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డేని ప్రకటించింది. కాబట్టి ఈరోజు మ్యాచ్ కొనసాగకుంటే.. శుక్రవారం మ్యాచ్ జరగనుంది. ఈరోజు మ్యాచ్ ఎక్కడ ఆగుతుందో.. అక్కడి నుంచే రేపు మ్యాచ్ ఆరంభం కానుంది.
అక్టోబర్ 31న కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఫైనల్‌కు చేరుతుంది. అంటే గ్రూప్ దశలో అపజయమెరుగని ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగాలని, భారత్ గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఐసీసీ పెట్టిన రిజర్వ్ డే నియమాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
రిజర్వ్ డే నియమాలు ఇవే:
# షెడ్యూల్ చేసిన రోజున మ్యాచ్ పూర్తి చేయడానికి అంపైర్లు ప్రయత్నిస్తారు. అవసరమైతే ఓవర్ల సంఖ్యను తగ్గిస్తారు.
# సెమీ-ఫైనల్ రోజున వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను తక్కువ ఓవర్లకు కుదించినా ఆట సాధ్యం కాకపోతే.. రిజర్వ్ డే రోజున ఫ్రెష్ మ్యాచ్ మొదలవుతుంది.
# వర్షం తర్వాత ఆట తిరిగి ప్రారంభమై, ఆ తర్వాత మళ్లీ ఆగితే.. తగ్గించబడిన ఓవర్లు రిజర్వ్ డేలో లెక్కించబడతాయి. ఫలితం కోసం ప్రతి జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాలి.
# రిజర్వ్ డే రోజున వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడితే.. గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.