NTV Telugu Site icon

Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్‌ రెడ్డి

Nitish Reddy Kohli

Nitish Reddy Kohli

అందరూ ఊహించిన విధంగానే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి భారత టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే (41; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వరుసగా వికెట్స్ పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్‌.. రిషబ్ పంత్‌తో కలిసి జట్టుకు విలువైన రన్స్ అందించాడు. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్ మాట్లాడుతూ.. తన ఆరాధ్య దైవం విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.

నితీశ్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘నాకు ఇది గొప్ప అనుభూతి. ఎప్పటి నుంచో భారత జట్టుకు ఆడాలని కలలు కంటున్నా. విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా క్యాప్‌ అందుకోవడం ఎంతో అద్భుతమైన క్షణం. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి విరాట్ భాయ్ నా ఆరాధ్య దైవం. అతని నుంచి టెస్ట్ క్యాప్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నేను ఆడింది గొప్ప ఇన్నింగ్స్‌ కాకపోయినప్పటికీ.. నాకు మంచి ఆరంభం దక్కింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా’ అని చెప్పాడు. విరాట్ అంటే తనకు చాలా ఇస్తామని ఐపీఎల్ ఇంటర్వ్యూలలో నితీశ్‌ చెప్పిన విషయం తెలిసిందే.

‘నేను పెర్త్ టెస్టులో అరంగేట్రం చేయనున్నానని మ్యాచ్‌కు ఒక్క రోజు ముందే తెలిసింది. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌ హర్షిత్‌ రాణాకు కూడా చెప్పింది. ఆ క్షణాన మా ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. అదే సమయంలో కాస్త భయపడ్డాం కూడా. అయితే ఒత్తిడికి లోనవకుండా ఆస్ట్రేలియాతో అనధికార టెస్టుల్లో ఎలా ఆడామో అలానే ఆడాలని నిర్ణయించుకున్నాం. భారత్-ఏ సిరీస్ నాకు చాలా ఉపయోగపడింది. భారత్‌తో పోలిస్తే పెర్త్ వికెట్‌పై చాలా బిన్నంగా ఉంది. బౌన్స్, ఇతర విషయాల్లో చాలా తేడాలు ఉన్నాయి. మెల్‌బోర్న్‌ పిచ్‌ కంటే పెర్త్ పిచ్‌ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తుందని భావించా. కానీ మెల్‌బోర్న్‌ లాగానే ఉంది. రిషబ్ పంత్ నాకు మార్గనిర్దేశం చేశాడు’ అని నితీశ్‌ పేరొన్నాడు.