బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్‌వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
Also Read: Koti Deepotsavam 2024: నేడు సీతారాముల కల్యాణోత్సవం.. ‘కోటి దీపోత్సవం’లో 15వ రోజు కార్యక్రమాలు ఇవే!
ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆట ఆరంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ (21)ని బుమ్రా ఔట్ చేశాడు. ఆ వెంటనే నాథన్ లయన్ (5) హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో మిచెల్ స్టార్క్ భారత బౌలర్లను అడ్డుకొన్నాడు. హేజిల్‌వుడ్, స్టార్క్ కలిసి పదో వికెట్‌కు 110 బంతుల్లో 25 రన్స్ జోడించారు. బౌలర్లు మారినా ఈ జంటను విడదీయడం సాధ్యం కాలేదు. లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్ భారీ షాట్‌కు యత్నించి.. పంత్‌కు చిక్కాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్క్ టాప్ స్కోరర్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్స్ తీశారు. లంచ్ అనంతరం మ్యాచ్ ఆరంభం కానుంది.