Australia Women clinch t20 series vs India Women: ఆస్ట్రేలియాపై తొలిసారి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకునే అవకాశంను భారత మహిళలు చేజార్చుకున్నారు. నిర్ణయాత్మక మూడో టీ20లో భారత మహిళా జట్టు ఓడిపోయింది. ముంబై వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆసీస్.. 2-1తో పొట్టి సిరీస్‌ను చేజిక్కించుకుంది. భారత్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.4 ఓవర్లలో మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో గెలిచిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.
మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓపెనర్‌లు షెఫాలి వర్మ (26; 17 బంతుల్లో 6×4), స్మృతి మంధాన (29; 28 బంతుల్లో 2×4, 1×6)) బ్యాట్ ఝుళిపించడంతో మంచి ఆరంభం దక్కింది. అయితే షెఫాలి, స్మృతి సహా జెమీమా (2), హర్మన్‌ప్రీత్ కౌర్ (3) పెవిలియన్ చేరడంతో 10 ఓవర్లలో 66/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రిచా ఘోష్ (34; 28 బంతుల్లో 2×4, 3×6) కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీప్తి (14), అమన్‌జ్యోత్ కౌర్ (17 నాటౌట్)తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఇన్నింగ్స్ చివరి బంతికి పూజ వస్త్రాకర్ (7 నాటౌట్) సిక్స్ కొట్టింది. సదర్లాండ్ (2/12), వేర్‌హామ్ (2/24) తలో రెండు వికెట్స్ తీశారు.
Also Read: Animal : జమాల్ కుదు సాంగ్ సీతార్ వెర్షన్.. నెక్స్ట్ లెవెల్ అంతే..
ఆసీస్ ఓపెనర్లు అలీసా హీలీ (55; 38 బంతుల్లో 9×4, 1×6), బెత్ మూనీ (52 నాటౌట్; 45 బంతుల్లో 5×4) అదిరే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా అలీసా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మూనీ కూడా ధాటిగా ఆడడంతో 9 ఓవర్లలో 80/0తో ఆసీస్ మంచి స్థితిలో నిలిచింది. 10వ ఓవర్లో అలీసా ఔటైనా మూనీ తన దూకుడు కొనసాగించింది. తాలియా మెక్‌గ్రాత్ (20), లిచ్‌ఫీల్డ్ (17 నాటౌట్)తో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. పూజ వస్త్రాకర్ (2/26) రెండు వికెట్స్ తీసింది.