NTV Telugu Site icon

Virat Kohli Century: ఒక్క సెంచరీ.. సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులు బద్దలు!

Virat Kohli Test

Virat Kohli Test

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ పలు రికార్డులపై కన్నేశాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్ రికార్డులను బ్రేక్ చేస్తాడు. మరో సెంచరీ సాధిస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సచిన్‌తో కలిసి విరాట్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 65 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సెంచరీలు చేయగా.. 44 ఇన్నింగ్స్‌లోనే విరాట్ 9 శతకాలు బాదాడు. మరొక్క సెంచరీ చేస్తే సచిన్‌ను అధిగమించి కింగ్ అవుతాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (8 సెంచరీలు, 51 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు, 37 ఇన్నింగ్స్‌లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు, 40 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: Champions Trophy 2025: భారత్‌కు రావొద్దు.. పాక్‌కు హర్భజన్‌ కౌంటర్!

విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్‌పై బ్రాడ్‌మన్ 11 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న విరాట్ ఆస్ట్రేలియాపై 10 శతకాలు చేశాడు. ఈ జాబితాలో జేబీ హాబ్స్ (9 సెంచరీలు-ఆస్ట్రేలియాపై), సచిన్ టెండూల్కర్ (9 సెంచరీలు-శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రెండో టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ మరో ఘనత అందుకుంటాడు.

 

 

 

Show comments