ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో బుధవారం రాత్రి జరగనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. పొట్టి సిరీస్ అయినా పట్టాలని భారత్ భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఎంపికకు టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. దాంతో ఒక మార్పు ఖాయం. బ్యాకప్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డాడు. అతడు ఆడేది లేనిది ఇంకా తెలియరాలేదు. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లోని పిచ్ బ్యాట్స్మన్లకు అనుకూలం. ఇక్కడ బౌన్స్, పేస్‌తో బంతి దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ కోటాలో ఆడడం ఖాయం. మూడో ఫాస్ట్ బౌలర్‌గా హర్షిత్ రాణా ఆడే అవకాశాలు ఉన్నాయి. వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో కూడా హర్షిత్ రాణించిన విషయం తెలిసిందే.
Also Read: 7800mAh బ్యాటరీ, 50MP కెమెరా.. OnePlus Ace 6 ఫోన్లో మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్స్ భయ్యో!
ఆసియా కప్ 2025లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి) ఆడింది. మనుకా ఓవల్ పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాబట్టి ఎవరు ఆడుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్‌రౌండర్ అక్షర్ తుది జట్టులో ఉండడం ఖాయం. మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధించగల సామర్థ్యం అతడికి కలిసిరానుంది. రెండవ స్పిన్నర్ స్థానానికి కుల్దీప్, వరుణ్ మధ్య పోటీ ఉంది. కుల్దీప్ 2018 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ఆడలేదు కానీ.. అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. వరుణ్ ఇంకా ఆసీస్ గడ్డపై ఆడలేదు. వరుణ్ ఆడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగం పటిష్టం కావాలనుకుంటే నితీష్ ఆడనున్నాడు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబేలు బ్యాటింగ్ విభాగంలో ఆడనున్నారు.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా/నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.