NTV Telugu Site icon

IND vs AUS: ఆస్ట్రేలియాకు సూపర్ ట్రాక్‌ రికార్డు.. వన్డేల్లో భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు!

India Vs Australia Odi Records

India Vs Australia Odi Records

India vs Australia ODI Head To Head Records:ప్రపంచకప్ 2023కి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ దూరం కాగా.. భారత జట్టును కేఎల్‌ రాహుల్‌ నడిపించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. ఆసియా కప్‌ 2023 గెలిచిన ఉత్సాహంలో భారత్ బరిలోకి దిగుతున్నా.. ఆసీస్ నుంచి గట్టి పోటీ తప్పదు. ఇక వన్డే సిరీస్‌ నేపథ్యంలో భారత్‌, ఆస్ట్రేలియా హెడ్‌ టూ హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.

వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 146 మ్యాచ్‌లు ఆడగా.. ఆస్ట్రేలియా ఏకంగా 82 మ్యాచ్‌లలో విజయం సాదించింది. భారత్‌ కేవలం 54 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. భారత గడ్డపై కూడా టీమిండియాపై ఆసీస్‌ ఆధిపత్యం చెలాయించింది. స్వదేశంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 67 మ్యాచ్‌లు జరగ్గా.. 30 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలవగా, 32 మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలిచింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

Also Read: IND vs AUS: విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మల విశ్రాంతికి అదే కారణమా?

ఇక నేడు తొలి వన్డే జరగనున్న మొహాలీలో భారత్‌కు చెత్త రికార్డు ఉండగా.. ఆస్ట్రేలియాకు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. మొహాలీలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. ఈ రికార్డు చూస్తే నేటి మ్యాచ్‌లో భారత్ ఓడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు స్టార్ ప్లేయర్స్ ముగ్గురు (రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా) లేకపోవడంతో భారత జట్టు బలహీనపడింది. మరి నేటి మ్యాచ్‌లో భారత్ గెలిచి ఆస్ట్రేలియాకు షాక్ ఇస్తుందో చూడాలి.

Show comments