Virat Kohli Needs 35 Runs To Become 1st Indian Cricketer: 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో తొలి టీ20 ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. 429 రోజుల తర్వాత విరాట్ భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. తనకు అచ్చొచ్చిన అఫ్గానిస్థాన్‌పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గాన్‌పైనే సెంచరీతో విరాట్ సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే ప్రత్యర్థిపై రాణించి.. జట్టులో తన ఎంపిక సరైందేనని విమర్శకులకు చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంది.
అఫ్గానిస్థాన్ రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12,000 పరుగుల మార్కును అందుకుంటాడు. దాంతో ఈ మార్క్ అందుకున్న తొలి భారత ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పుతాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (14,562) పేరిట ఉంది. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ (12,993), విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ (12,430) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Shaun Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఫామ్‌లో ఉండగానే..!
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఈరోజు ఇండోర్ వేదికగా రెండో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. విరాట్ చివరిసారిగా 2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఆడాడు. ఆ తరువాత టెస్ట్, వన్డేలు మాత్రమే ఆడాడు. నిజానికి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే అతడు ఆడాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. చాలా రోజుల తర్వాత టీ20ల్లో బరిలోకి దిగుతుండడంతో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది.