NTV Telugu Site icon

IND vs SL: నేడు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే.. సమం చేస్తారా? భారత తుది జట్టులో మార్పులు

Ind Vs Sl 2nd Odi

Ind Vs Sl 2nd Odi

IND vs SL Playing 11 for 3rd ODI: టీ20 సిరీస్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత జట్టుకు వన్డేల్లో మాత్రం ఆతిథ్య శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక మ్యాచ్‌ టై చేసుకుని, మరో పోరులో ఓడిన టీమిండియాకు బుధవారం ఆఖరి పరీక్ష ఎదురుకానుంది. శ్రీలంక స్పిన్, స్లో పిచ్‌లకు దాసోహమైన రోహిత్ సేన.. చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని.. టీ20 ఫార్మాట్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. నేటి మధ్యాహ్నం 2:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో మూడో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. శ్రీలంక స్పిన్‌ను ఆడలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. రోహిత్ శర్మ మినహా మరే బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. విరాట్‌ కోహ్లీ (24, 14), కేఎల్‌ రాహుల్‌ (31, 0), శ్రేయస్‌ అయ్యర్‌ (23, 7) రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. శుబ్‌మన్‌ గిల్ పరుగులు చేయాల్సి ఉంది. ఇక శివమ్ దూబే దారుణంగా విఫలమయ్యాడు. దాంతో రాహుల్, దూబే స్థానాల్లో రిషభ్ పంత్‌, రియాన్ పరాగ్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్‌ రాణిస్తున్నారు.

టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో పరువు పోగొట్టుకున్న ఆతిథ్య శ్రీలంక వన్డే సిరీస్‌ను కొట్టాలనే పట్టుదలతో ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై లంక బౌలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రెండో వన్డేలో వాండర్సె 6 వికెట్స్ తీశాడు. స్పిన్‌తో పటిష్టమైన భారత్ బ్యాటింగ్‌ లైనప్‌ను తేలిగ్గా కూల్చేస్తున్నారు. చివరి వన్డేలోనూ స్పిన్‌తో దెబ్బకొట్టాలని చూస్తోంది. అసలంక, నిసాంక, ఫెర్నాండో, మెండిస్ బ్యాటింగ్లో రాణిస్తున్నారు. కొలంబో పిచ్‌ స్పిన్‌కు స్వర్గధామం. మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్నా.. ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

Also Read: Vinesh Phogat-Gold Medal: గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్‌ ఫొగాట్‌!

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/రిషభ్ పంత్, రియాన్ పరాగ్/శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
శ్రీలంక: చరిత్‌ అసలంక (కెప్టెన్‌), నిసాంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్, సమరవిక్రమ, లియనాగె, వెల్లలాగె, కమిందు మెండిస్, అకిల దనంజయ, వాండర్సె, అసిత్‌ ఫెర్నాండో.