India Playing 11 against Australia for World Cup Final 2023: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తుది దశకు చేరుకుంది. మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాపై గెలిచి 2003 పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలని ఆసీస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనల్‌లో బరిలోకి దిగే భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ప్లేయింగ్ 11ను ఓసారి పరిశీలిస్తే..
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఫైనల్‌లో కూడా హిట్‌మ్యాన్ దూకుడు కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సెమీ ఫైనల్‌లో గిల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాయంతో మధ్యలో మైదానాన్ని వీడినా.. ఆపై వచ్చి బ్యాటింగ్ చేయడమే కాకుండా ఫీల్డింగ్ కూడా చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. సెమీ ఫైనల్‌లో సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరలో కేఎల్ రాహుల్ పరుగుల వరద పారిస్తున్నారు. మొత్తంగా టీమిండియా టాప్ ఆర్డర్ బలంగా ఉంది.
బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్పెలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు కారణం.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండడమే. అశ్విన్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లకు పరుగులు చేయడం అంత సులువు కాదు. ఓపెనర్లు వార్నర్, హెడ్ లెఫ్టాండర్లు కాబట్టి.. యాష్ బౌలింగ్‌లో పరుగులు సాధించడం వారికి కష్టమే. ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అత్యంత కీలకం కాబట్టి.. వారు భారీ ఇన్నింగ్స్ ఆడకుండా ఆపాలంటే అశ్విన్ జట్టులో ఉండటం ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అశ్విన్ జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ కాస్త బలహీనం అవుతుంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో.
Also Read: CWC 2023 Final: భారత్ బ్యాటింగ్, బౌలింగ్ బాగున్నా.. ఎక్స్‌ట్రాలు మాత్రం భయపెడుతున్నాయి! ఓటమి కొని తెచ్చుకోవడమే
భారత్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు వికెట్స్ తీస్తున్నారు. ముఖ్యంగా షమీ ఐదేసి వికెట్స్ పడగొడుతూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. గత మ్యాచులో తడబడిన బుమ్రా, సిరాజ్ ఫైనల్లో మెరవాల్సి ఉంది. స్పిన్ బౌలింగ్ బలహీనత ఉన్న ఆసీస్ బ్యాటర్లు.. కుల్దీప్, జడేజాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.