ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో అనిల్ పాటిల్ అనే యువకుడు హల్చల్ సృష్టించాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండింగ్ అవుతుండగా డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. విమానంలోని ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. యువకుడిని పట్టుకున్నారు.విమానం ల్యాండింగ్ అవుతుండగా డోర్ తీసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. యువకుడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు అప్పగించారు. హల్ చల్ చేసిన అనిల్ కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ లోని గాజులరామారంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆర్జీఐ పోలీసులు జిమ్ ట్రైనర్ కి నోటీసులు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఎందుకు అలా ప్రవర్తించాడు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఒక్కసారిగా యువకుడు డోర్ వద్దకు వెళ్లి దాన్ని లాగేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కాగా.. గతేడాది జూన్ లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు రక్షించారు. అర్ధరాత్రి సమయంలో, బెంగళూరుకు చెందిన ఒక మహిళ RGI ఎయిర్‌పోర్ట్ డిపార్చర్ టెర్మినల్ వద్ద రెయిలింగ్‌ను దాటింది. దూకడానికి ప్రయత్నిస్తుండగా CISF సిబ్బంది ఆమెను పట్టుకుని సురక్షితంగా వెనక్కి లాగారు. ఆ తర్వాత మహిళను ఓ గదికి తరలించి, కొద్దిసేపు ఉంచిన తర్వాత సీఐఎస్‌ఎఫ్ స్థానిక అధికారులకు అప్పగించింది.