మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల సొమ్ము దోచుకుని దాచుకోవడానికి చంద్రబాబుకు అధికారం కావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో టీవీ ఆన్ చేస్తే ఊక దంపుడు వాగ్దానాలు చేశారు… నరక లోకానికి, నారా లోకానికి వెళ్ళాలని ఎవరు అనుకోరని విమర్శించారు. అందుకే కిచిడి వాగ్దానాలు తెచ్చి స్వర్గం చూపిస్తున్నారని ఆరోపించారు. మన ఫ్యాన్ కు నవరత్నాలు అనే పథకం ద్వారా కరెంటు వస్తుంది… ఆ పథకాల ద్వారా నే మన ఫాన్ కు పవర్ వస్తుందని సీఎం జగన్ తెలిపారు.
చంద్రబాబు తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కడానికి, తొయ్యడానికి వేరే పార్టీల అండ కావాలని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు ద్వారా ఈ రాష్ట్రానికి ఒక్క మంచైనా జరిగిందా.. అందుకే ఇంకో దత్తపుత్రుడు చంద్రబాబుకు డప్పు కొడుతున్నాడని ఆరోపించారు. దత్తపుత్రుడుకి సీట్లు తక్కువ ఇచ్చినా మాట్లాడ లేని స్థితిలో ఉన్నాడని దుయ్యబట్టారు. పద్నాలుగేళ్ల పాలన చేసిన చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న సున్నాగానే మిగిలి పోతాడని మండిపడ్డారు. ఇప్పుడు పొత్తులు పెట్టుకున్న ముగ్గురు, 2014లో ఒకే వేదిక మీదికి వచ్చారు.. ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ లు పంచారు.. దొంగ పథకాలు ప్రకటించారని దుయ్యబట్టారు.