NTV Telugu Site icon

G20 Summit: ఉక్రెయిన్‌ యుద్ధంపై తీర్మానం.. జీ20 ప్రకటనపై ఉక్రెయిన్‌ ఏమందంటే?

Ukraine War

Ukraine War

G20 Summit: జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.

“యూఎన్‌ చార్టర్‌కు అనుగుణంగా అన్ని దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా ఏదైనా దేశ రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ప్రాదేశిక స్వాధీనం కోసం బెదిరింపు లేదా బలప్రయోగం నుంచి దూరంగా ఉండాలి” అని జీ20 నాయకులు ఆమోదించిన ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాలు ఇండోనేషియా బాలీలో జరిగిన తీర్మానాన్ని పునరుద్ఘాచించాయి. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు నడుచుకోవాలని పిలుపునిచ్చాయి. అణ్వాయుధ ప్రయోగాల ముప్పు ఉండకూడదని కోరాయి. 2022లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. “నేటి యుగంలో యుద్ధం ఉండకూడదు” అని డిక్లరేషన్ పేర్కొంది.

Also Read: G20 Summit Live Updates: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో విందు కార్యక్రమం

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ప్రపంచ ఆహార, ఇందన భద్రత, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై యుద్ధం ప్రభావం చూపుతోందని తీర్మానించారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు నుంచి కోలుకుంటున్న దేశాలను ఉక్రెయిన్ యుద్ధం కష్టకాలంలోకి నెట్టేసిందని సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి. రష్యా, ఉక్రెయిన్‌ నుంచి ముడి పదార్థాలను ఎటువంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలని జీ20 సమ్మిట్ పిలుపునిచ్చింది. సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు, దౌత్యం, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్‌ అభిప్రాయపడింది.అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి G20 ప్రధాన వేదిక అని పునరుద్ఘాటిస్తూ.. జీ20 భౌగోళిక, రాజకీయ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వేదిక కానప్పటికీ, G20 నాయకులు ఈ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పరిణామాలను కలిగిస్తాయని అంగీకరించారు.

స్పందించిన ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి జీ20 గ్రూప్ దేశాల ఉమ్మడి ప్రకటన పట్ల గర్వపడాల్సిన పనిలేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. రష్యా గురించి ప్రస్తావించనందుకు విమర్శలు గుప్పించింది. ఉక్రేనియన్‌ పక్షం జీ20 సమావేశంలో పాల్గొన్నట్లయితే పరిస్థితిని వివరించే అవకాశం ఉండేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒలేగ్ నికోలెంకో ఫేస్‌బుక్‌లో రాశారు.