NTV Telugu Site icon

Kota: కోటాలో రాలిపోతున్న విద్యార్థులు.. మరో విద్యార్థి ఆత్మహత్య

Kota

Kota

Kota: రాజస్తాన్‌లోని కోటా.. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. ఈ నెలలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్‌ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్‌ నోట్‌ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరస ఆత్మహత్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మంగళవారం రాత్రి మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెలలోనే ఇది నాలుగో ఘటన కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Read Also: Jacqueline Fernandez: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్‌ రిలీఫ్!

బీహార్‌లోని గయాకు చెందిన 18 ఏళ్ల బాల్మీకి ప్రసాద్‌ మంగళవారం రాత్రి మహావీర్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. ఇంటి యజమాని ఇతర విద్యార్థులతో కలిసి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతను ప్రస్తుతం ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నాడు. మంగళవారం రాత్రి అద్దె వసతి గృహంలో తన గదిలోకి ఆ విద్యార్థి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. తోటి విద్యార్థులు వెళ్లి తలుపు తట్టినా సమాధానం లేదు. బాలుడు తన గదిలో వేలాడుతున్నట్లు గుర్తించిన వారు ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మరణం వెనుక ఉన్న కారణం గురించి ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ఇంటి యజమానితో పాటు ఇంట్లో నివసిస్తున్న ఇతర విద్యార్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Ponnala Lakshmaiah : ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారు

తాజా కేసుతో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఏడాది 20 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒత్తిడే ప్రధాన కారణమన్న వార్తలు వినిపిస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు నిర్ధరాంచలేదు. కాగా, గతేడాది కూడా 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఈసారి ఆ సంఖ్య మించిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు రాజస్థాన్ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది. కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.